

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 23:
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లోని అహోబిలం నందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం నిమిత్తం విచ్చేయున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం గుడి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అహోబిల క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అహోబిల క్షేత్రంలోని మాడా వీధులను, క్యూలైన్లను పరిశీలించడంతో పాటు అక్కడ భక్తుల అవసరాలకు తగ్గట్టుగా త్రాగునీరు, ఇతర వసతులను ఏర్పాటు చేయాలన్నారు.
ఎగువ అహోబిలం నందు కళ్యాణకట్ట,రథోత్సవం మరియు విగ్రహాలను ఊరేగించు పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు సరైన పార్కింగ్ సదుపాయాలను కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ డిఎస్పి కె.ప్రమోద్, ఆళ్లగడ్డ రూరల్ ఇన్స్పెక్టర్ బి.వి రమణ, సబ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, ఆలయ అధికారులు వారి సిబ్బంది పాల్గొన్నారు.
