

విద్యా కుసుమానికి జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయం
ఉన్నత విద్యకు లక్ష రూపాయల చెక్కు అందజేత
- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 19 :
మట్టిమిద్దె కూలిపోవడం వల్ల అనాథగా మారిన విద్యార్థిని విద్యా కుసుమాన్ని అక్కున చేర్చుకొని, అమ్మాయి ఉన్నత విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అందజేశారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ అనంతరం, మట్టిమిద్దె కూలిపోవడంతో కుటుంబాన్ని కోల్పోయిన విద్యార్థిని ఉన్నత విద్య (ఇంటర్మీడియట్) కోసం లక్ష రూపాయల విలువైన చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 25 వేల మంది మట్టిమిద్దెల్లో నివసిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాల కారణంగా మట్టిమిద్దెలు కూలిపోయి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా రెవెన్యూ యంత్రాంగం ద్వారా వారం రోజుల ముందుగానే మట్టిమిద్దె నివాసితులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ అకాల వర్షాల తీవ్రత కారణంగా చాగలమర్రి మండలం చిన్నగొంగలి గ్రామానికి చెందిన ఒక కుటుంబం తీవ్ర విషాదాన్ని ఎదుర్కొందన్నారు. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, ముగ్గురు కుమార్తెలు నివసించేవారని, మట్టిమిద్దె కూలిపోవడంతో భార్యాభర్తలు మరియు ఇద్దరు కుమార్తెలు మృతి చెందారని తెలిపారు. కుటుంబానికి చెందిన తలపురెడ్డి గురులక్ష్మి ప్రసన్న అనే విద్యార్థిని ప్రొద్దుటూరు వసతి గృహంలో పదవ తరగతి చదువుతుండటంతో ప్రాణాలతో బయటపడిందన్నారు. సదరు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల నష్టపరిహారం మంజూరు చేయడంతో పాటు, ప్రాణాలతో బయటపడిన బాలిక భవిష్యత్తు దృష్ట్యా రూ.2 లక్షలను ఆమె అమ్మమ్మకు అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం విద్యార్థిని పదవ తరగతి పూర్తి చేసిన నేపథ్యంలో, ఆమె ఇంటర్మీడియట్ విద్య కొనసాగించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
