సంక్రాంతి వేళ ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలపై కఠిన చర్యలు – జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 13 :
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో, ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టిందని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి తెలిపారు.
గత ఐదు రోజులుగా ఆర్టీజీఎస్ పర్యవేక్షణతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేర్ మానిటరింగ్ టీముల ద్వారా అభిబస్, రెడ్ బస్ తదితర ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫార్ములలోని బస్సు ఛార్జీలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత ప్రైవేట్ బస్సు యజమానులతో సమన్వయం చేసి, ఛార్జీలను తక్షణమే తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆర్టీసీ నిర్దేశించిన ఛార్జీలపై గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే అదనంగా వసూలు చేయాలని స్పష్టం చేస్తూ, దానికంటే ఎక్కువగా టికెట్లు విక్రయిస్తే సంబంధిత బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ నెంబర్ 9281607001 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్సు ఛార్జీలు లేదా ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించి తక్షణ పరిష్కారం అందిస్తారని చెప్పారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రతి ప్రైవేట్ బస్సులో స్పష్టంగా ప్రదర్శించాలని బస్సు యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
మోటార్ వాహన తనిఖీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మోటార్ వాహన తనిఖీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఐదు రోజులుగా నిర్వహించిన తనిఖీలలో అధిక ఛార్జీలు వసూలు చేసిన పలు ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేసి, పన్ను, పర్మిట్ తదితర నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు బస్సులపై కేసులు నమోదు చేసి మొత్తం రెండు లక్షల తొంభై రెండు వేల రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక తనిఖీలు మరియు పర్యవేక్షణ జనవరి 18 వరకు కొనసాగుతాయని, పండుగ అనంతరం తిరుగు ప్రయాణాల సమయంలో కూడా ఇదే విధమైన కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు భద్రతతో కూడిన ప్రయాణం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పండుగ కాలంలో ప్రయాణికుల శ్రేయస్సు కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి తెలిపారు.

Scroll to Top