


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 19 :
నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శివాజీ జయంతి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి. సుబ్బయ్య ముఖ్య అతిథిగా విచ్చేయగా, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు శివాజీ జీవిత విశేషాలపై ప్రసంగించారు.
ప్రిన్సిపాల్ కె.వి.వి. సుబ్బయ్య మాట్లాడుతూ 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ అద్భుతమైన పరిపాలనాదక్షుడని కొనియాడారు. 1674లో రాయగఢ్లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్న ఆయన, మహిళల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉండేవారని తెలిపారు. నేటి తరం ఆయన ధైర్యాన్ని, నమ్మకాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎం. ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ స్వయం పరిపాలనను (స్వరాజ్యం) ఆకాంక్షించారని వివరించారు. సమర్థవంతమైన పాలన కోసం ఆయన ‘అష్టప్రధాన్’ (ఎనిమిది మంది మంత్రుల మండలి) విధానాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మత సామరస్యం మరియు మహిళా హక్కుల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
శ్రావణి కుమారి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ గొప్ప వ్యక్తిత్వం వెనుక ఆయన తల్లి జీజాబాయి పెెంపకం ఉందని, ఆమె నేర్పిన సంస్కారమే ఆయన్ని గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దిందని తెలిపారు. ఆయన ఆశయాలను అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 1680లో రాయగఢ్ కోటలో ఆయన తుదిశ్వాస విడిచారని, కానీ ఆయన కీర్తి అజరామరమని పేర్కొన్నారు.
శివాజీ మహారాజ్ చూపిన స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
