రైతు సంఘం రాష్ట్ర నాయకుడు అప్పలరాజు పై పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలి

రైతు, కౌలు రైతు, కార్మిక,వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 12 :
అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజు పై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేయాలి.అప్పలరాజును తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని, ఏలూరు జిల్లా బుట్టయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్భంధం అపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ రామనాయక్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఏ .రాజశేఖర్, టి. రామచంద్రుడు, ఉపాధ్యక్షుడు T. వెంకటేశ్వరరావు, సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శులు ఏ. సురేష్, వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్, గురెడ్డి, హిమం హుస్సేన్,
సిఐటియు నాయకులు కేఎండి గౌస్, లక్ష్మణ్, సుబ్బారావు, గోపాల్,జైలాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహులు లతో పాటు 100మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం. అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పి. డి. చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు లోనిర్బంధించింది.గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీ.డీ. చట్టాన్ని రైతు నాయకుడు ఎం. అప్పలరాజు పై ప్రయోగించి జైల్లో నిర్బంధించటాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్య కారకంగా మారుతుంది. మత్స్య సంపద దెబ్బతింటుంది. మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. ప్రజలు, రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెపుతున్నది. దానికి విరుద్దంగా మిట్టల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిస్సాన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. వారికి అండగా ఉన్నాడన్న కక్షతో రైతు నాయకుడు అప్పలరాజు పై ప్రభుత్వం పి.డి.చట్టాన్ని ప్రయోగించింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించే దిశగా కాకుండా నిరంకుశంగా నిర్బందాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఇది ఏ మాత్రం సరైనది కాదు. అప్పలరాజు విషయంలో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును, చట్టం పరిధిలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వం పీడి చట్టం ప్రయోగించడం ద్వారా కాలరాస్తున్నది. ఈ రకమైన నిరంకుశ వైఖరిని మానుకోవాలని కోరుచున్నాము. తక్షణమే అప్పలరాజు పై పెట్టిన పీ.డీ. చట్టాన్ని రద్దు చేయాలని, జైలు నుండి విడుదల చేయాలని కోరారు.ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో 1/70 చట్టానికి భిన్నంగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూములలో వేసిన మొక్కజొన్న ఇతర పంటలను బుట్టాయిగూడెం తాసిల్దార్, ఎస్సై, పోలీసులు కలిసి ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సైని ప్రశ్నించిన గిరిజనుల పైన ఎస్సై బౌతికంగా దాడి చేశాడు. మహిళలు అని చూడకుండా మగ పోలీసులే మహిళలను జాకెట్లు చింపి చేయి పట్టుకుని పక్కకు లాగివేశారు. అడ్డువచ్చిన గిరిజన రైతును లాఠీతో కొడితే తల పగిలి రక్తగాయమైంది. ఈ ఘటనలో దౌర్జన్యం చేసిన పోలీసుల మీద, రెవెన్యూ అధికారుల మీద ఎలాంటి చర్య తీసుకోకపోగా గిరిజనులపైనే తప్పుడు కేసు నమోదు చేశారు.విశాఖపట్నం లో విద్యార్ధి సంఘాల కార్యకర్తలపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు.ఈ రకంగా అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు అప్పలరాజు పై పెట్టిన పి. డి. చట్టం, ఏలూరు జిల్లా ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులు, విద్యార్థులపై పెట్టిన రౌడీషీట్ అన్నింటిని ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై నిర్భందాన్ని అపాలని ప్రజాసంఘాల తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

Scroll to Top