భూసార పరీక్ష కేంద్రాల ద్వారా రైతులకు సమగ్ర సేవలు అందించాలి –  జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా*

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
రైతులకు భూసార పరీక్ష కేంద్రాల ద్వారా అవసరమైన సేవలను సమర్థవంతంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని పాత మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు కలెక్టర్ వెంట ఉన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భూసార పరీక్షల ద్వారా నేలలో ఉన్న పోషకాల లోపాలను గుర్తించి, అవసరమైనంత మేరకే ఎరువులను వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అవసరానికి మించి రసాయన ఎరువులు వినియోగించకుండా ఉండటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో 22 వేల మట్టి నమూనాలను సేకరించి వాటికి సంబంధించిన సాయిల్ హెల్త్ కార్డులు (మట్టి ఆరోగ్య పరీక్ష కార్డులు) రైతులకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాల నుండి 20 వేల మట్టి నమూనాలను సేకరించి వారికి కూడా సాయిల్ హెల్త్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 14 వేల మట్టి నమూనాల పరీక్షలు ప్రారంభమైనట్లు తెలియజేస్తూ, మార్చి నెలాఖరులోగా అన్ని నమూనాల పరీక్షలను పూర్తి చేయాలని భూసార పరీక్ష కేంద్ర సిబ్బందికి ఆదేశించారు.

*భూసార పరీక్ష కేంద్రానికి అవసరమైన మున్సిపల్ తాగునీటిని నిరంతరంగా సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో పరీక్షలు నిర్వహించేందుకు, మట్టి నమూనాలు భద్రపరచేందుకు అదే భవనంలో ఉన్న రెండు గదులను కేటాయించాలని సిబ్బంది కోరగా, మార్కెట్ కమిటీ సెక్రటరీ మరియు ఛైర్మన్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే, కేంద్రానికి అవసరమైన విద్యుత్ సదుపాయం, రసాయనాల నిల్వ కోసం అలమారాలు తదితర మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు సమర్పిస్తే వాటిపై తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Scroll to Top