ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి: నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 04:
ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధాలు ఆగిపోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. మంగళవారం నంద్యాలలోని నౌమన్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా జరిగిన ‘యేసుకృప పండుగలు’ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, ప్రపంచ శాంతి కోసం భక్తులందరూ ఐక్యంగా ప్రార్థించాలని కోరారు. మైనారిటీ శాఖ మంత్రిగా తన తండ్రి ఫరూక్ చర్చీలకు, మసీదులకు ఎంతో మేలు చేస్తారని, త్వరలోనే సమాధుల తోట మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ.. నంద్యాల మున్సిపాలిటీని ఒక కుటుంబంగా భావిస్తున్నానని, నగరాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని కోరారు.
యేసుకృప మినిస్ట్రీస్ అధినేత అందనం సుధాకర్ ప్రసంగిస్తూ.. దేవుడు విడిపోయిన కుటుంబాలను కలిపే వాడని, ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని బోధించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కృపాకర్, దేవరపాటి రవికుమార్ , నాగేశ్వరరావు, సాయిరాం మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, సేవకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top