ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించండి

పిజిఆర్ఎస్ ద్వారా 206 దరఖాస్తుల స్వీకరణ

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 121 దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 23 :

ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించి ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డిఆర్ఓ రామునాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేగవంతంగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉండాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ ఇంకా 104 దరఖాస్తులు ఓపెన్ చేసి చూడకపోవడం విచారకరమన్నారు. రీఓపెన్ దరఖాస్తులకు సంబంధించి ఇంకా 305 దరఖాస్తులు రీఓపెన్ చేయడం జరిగిందని వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటికి తొలి ప్రాధాన్యంతో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 121 అర్జీల స్వీకరణ :

భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 121 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి 9, అడంగల్ సవరణలకు సంబంధించినవి 24, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి 12, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి 29, రెవెన్యూ కోర్టు విచారణలు/ఆర్‌ఓఆర్‌కు సంబంధించినవి 14, సర్వే, రీ-సర్వేలకు సంబంధించినవి 30, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి 3 గా ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

Scroll to Top