

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 29-12-2025) నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఫిర్యాదిదారుల నుంచి 75 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదులలో కొన్ని….
1).నేను జనవరి 2025 నుండి అక్టోబర్ వరకు నంద్యాల పట్టణంలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో పనిచేశాను. నాకు ఇంతవరకు జీతం ఇవ్వకపోగా కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య అనుచితంగా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.నాకు న్యాయం చేయండని P.మల్లికార్జునయ్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
2).నేను ANM గా పనిచేయుచున్నాను. నాకు బాలుగ్రం అనే వ్యక్తిగా 2019లో వివాహం జరిగింది. నాతో వివిధ ప్రవేట్ బ్యాంకులలో 30 లక్షలకు పైగా లోన్లు తీసుకుని నాతో సంతకాలు పెట్టించి నా జీతం నుండి ప్రతినెలా 28,000 EMI కట్టేలా మరియు వేరే అమ్మాయిలతో తిరుగుతూ నన్ను మోసం చేస్తున్నాడు. ఆ డబ్బులు నన్ను కట్టమని శారీరకంగా మానసికంగా ప్రతిరోజు నన్ను వేధిస్తున్నాడు. నాకు న్యాయం చేయండని ఓ బాధితురాలు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
3).నాకు సంబంధించిన స్థలంలో గడ్డివాము, బర్రెల కొట్టం వేసి శ్రీనివాసులు, నరసింహుడు,వెంకటేశ్వర్లు అనువారు ఆక్రమించుకోవడం జరిగింది.తీసివేయమని చెప్పగా తీస్తామని తీయడం లేదు. నాపై దయవుంచి నాకు న్యాయం చేయండని బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
4).నేను వృద్ధుడను నాకు ఏ ఆధారము లేదు. నాకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు, కోడలు నా భార్యకు సంబంధించిన ఐదు తులాల బంగారం ఇవ్వడం లేదు వారిపై కఠిన చర్యలు తీసుకొని నా బంగారం ఇప్పించి న్యాయం చేయాలని నూనెపల్లె సాదిక్ నగర్ కు చెందిన బాదుల్లా జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
