ప్రజల భాగస్వామ్యంతో సమాజంలో మార్పు పీ-4పై మంత్రి విశ్వాసం
ఉద్యమంగా మారుతున్న పీ-4 కార్యక్రమం
అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్న పీ-4 కార్యక్రమం
జిల్లా ఇంచార్జి మంత్రి పయ్యావుల కేశవ్






సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 30 :
పేదరికం లేని సమాజ నిర్మాణమే పీ-4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఇంచార్జి మంత్రి, ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన “పీ–4 వార్షికోత్సవ స్వర్ణాంధ్ర @ 2047” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రారంభించిన పీ–4 కార్యక్రమంపై మొదట అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏ మార్పు ప్రారంభించినా అడ్డంకులు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు తెలిపారు. పీ-4 కార్యక్రమం ప్రారంభమై సంవత్సరం పూర్తవుతున్న ఈ సందర్భంలో, ప్రజలలో సహకారం, బాధ్యతా భావం పెరిగి, సమాజంలో సానుకూల మార్పు కనిపిస్తోందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాకుండా, ప్రజలే ముందుండి చేపట్టే ఉద్యమంగా మారుతోందని వివరించారు. గ్రామ స్వరాజ్య భావనను గుర్తుచేసుకుంటూ, గతంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవని, ప్రజలు కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకునే సంప్రదాయం ఉండేదని చెప్పారు. ఆ సహకార భావాన్ని తిరిగి తీసుకురావడమే పీ-4 కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా పీ 4 కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల ఫలితంగా రూపుదిద్దుకుని, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతోందని తెలిపారు. సమాజంలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న సేవా మూర్తులను గుర్తించి, వారికి ప్రభుత్వ స్థాయిలో గౌరవం ఇవ్వడం ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల పరిష్కారం, చెరువుల పునరుద్ధరణ వంటి పనులను ప్రాధాన్యంగా చేపడుతున్న అధికారుల కృషిని ఆయన అభినందించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా బాలబాలికల వసతి గృహాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఉచిత ఆంబులెన్స్ సేవలను అందిస్తున్న దాతలను ప్రశంసిస్తూ, ప్రైవేట్ ఆంబులెన్స్ మాఫియా కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా కట్టడి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జిజిహేచ్ ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వికలాంగులకు నెలకు సుమారు 10 ట్రై-సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న దాతల సేవలను కొనియాడిన మంత్రి, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న విద్యాసంస్థల పాత్రను ప్రశంసించారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అదే స్ఫూర్తితో అధికారులు కూడా ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ప్రారంభించిన ‘జీరో పావర్టీ పీ4’ కార్యక్రమం సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని తెలిపారు. ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలు చేయూత అందిస్తే, పేద కుటుంబాలు కూడా ఎదిగి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. గత సంవత్సరం మార్చి 30న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఏడాది పూర్తైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయం పొందే వారిని ‘బంగారు కుటుంబాలు’, సహాయం అందించే వారిని ‘మార్గదర్శకులు’గా పిలుస్తున్నామని తెలిపారు. జిల్లాలో 50,038 బంగారు కుటుంబాలను గుర్తించి, వాటిలో 49,865 కుటుంబాలను ఇప్పటికే 4,805 మంది మార్గదర్శకులతో అనుసంధానం చేశామని వెల్లడించారు. ఉపాధి, వైద్య సహాయం, విద్య, చిన్న వ్యాపారాలు వంటి అవసరాలకు మార్గదర్శకులు తోడ్పాటు అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో విజన్ ప్లాన్ యూనిట్లు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాల కోసం రూ.80 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయం, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు వంటి అంశాల్లో బంగారు కుటుంబాలకు సహాయం అందుతోందని తెలిపారు. కలెక్టర్‌గా తాను 44 చెంచు కుటుంబాలను దత్తత తీసుకుని, వారికి గ్యాస్ కనెక్షన్లు, గృహావసరాలు, ఆర్ఓ ప్లాంట్లు, సిసి రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చిన్న సహాయం కూడా ఒక కుటుంబానికి పెద్ద మార్పును తీసుకురాగలదని, మార్గదర్శకులు అందిస్తున్న సేవలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మంత్రులు మరియు జిల్లా కలెక్టర్ సమక్షంలో, సమాజ సేవలో విశేషంగా కృషి చేసిన మార్గదర్శకులకు ప్రశంసాపత్రాలు అందజేసి, వారి సేవలను కొనియాడారు.
అగ్రి గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రంగారెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పేదలకు స్వచ్ఛమైన తాగునీరు అందించినందుకు ప్రశంసాపత్రం అందజేశారు. టేకూరు నాగేశ్వరరావు ‘బంగారు కుటుంబం’ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినందుకు సన్మానం చేశారు. గోపిరెడ్డి ప్రతాప్ రెడ్డికి వివిధ సంస్థలకు సహకరించి, బంగారు కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడినందుకు ప్రశంసాపత్రం అందించారు. మాయలూరు రవీంద్రనాథ్ రెడ్డికి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలకు విశేషంగా సహకరించినందుకు గాను సత్కరించారు. సయ్యద్ జాకీవుల్లా బాషాకు మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించినందుకు ప్రశంసాపత్రం అందజేశారు. వేణుగోపాల్‌కు కమ్యూనిటీ అభివృద్ధికి, అవసరమైన వారికి సహాయం అందించినందుకు గాను సన్మానం చేశారు. ఈ సందర్భంగా సేవ చేసిన ప్రతి ఒక్కరూ సన్మానానికి అర్హులేనని మంత్రులు, కలెక్టర్ పేర్కొంటూ, సమాజ సేవలో ముందుండే వారికి అభినందనలు తెలిపారు.
