


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 14 :
జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాధికారులతో ప్రజా సానుకూలత, ముఖ్య అభివృద్ధి సూచికలు, నియోజకవర్గాల సమస్యలపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పనితీరు ఆధారంగా నంద్యాల జిల్లా కాంపోజిట్ ర్యాంకింగ్లో 6వ స్థానంలో నిలిచి “లీడర్స్” కేటగిరీలో చోటు దక్కించుకోవడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్ సమీక్షల్లో ఇంకా మెరుగైన స్థానాన్ని సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
జిల్లా ఆర్థిక వృద్ధిని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని, గతంలో జిడిపి సహకారంలో 22వ స్థానంలో ఉన్న జిల్లా ప్రస్తుతం 18వ స్థానానికి చేరుకుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆదాయం గత ఏడాది రూ.4400 కోట్ల నుంచి ఈ ఏడాది సుమారు రూ.7500 కోట్లకు పెరిగిందన్నారు. బీడు భూములను సాగులోకి తేవడం, ద్విపంట సాగు ప్రోత్సాహం వంటి చర్యలు దీనికి దోహదపడ్డాయని చెప్పారు.
ఉద్యానవన రంగం ద్వారా జిల్లాకు సుమారు రూ.7000 కోట్ల ఆదాయం లభిస్తున్నదని పేర్కొన్నారు. రైతులు అధిక లాభదాయక పంటలు, ఆధునిక సాగు విధానాలు అనుసరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సులభంగా చేరేలా పారదర్శకంగా అమలు చేయాలని, పెన్షన్లు, రేషన్ పంపిణీ వంటి సేవల్లో సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజల సంతృప్తి శాతాన్ని పెంచేందుకు శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో సుమారు 2.16 లక్షల మందికి ప్రతినెల రూ.100 కోట్ల మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి 91 శాతం మాత్రమే సానుకూల స్పందన వస్తోందని చెప్పారు. దీనిని 98 శాతం పైగా పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రేషన్ పంపిణీ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
కొన్ని శాఖల్లో ప్రజల సంతృప్తి తక్కువగా ఉన్నందున వాటి పనితీరును మెరుగుపరచాలని కలెక్టర్ తెలిపారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ఆధారంగా శాఖల పనితీరును విశ్లేషించి మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, విద్యార్థుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
