రోడ్డు ప్రమాదాల నివారణ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు


సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 03:
జిల్లావ్యాప్తంగా విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి సిబ్బంది సహాయంతో ముఖ్యమైన కూడలిలో, రద్దీ ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించడంతో పాటు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ వాహనదారులు స్వీయ క్రమశిక్షణతో రహదారి నియమాలు పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలు కొంతవరకు నివారించవచ్చునన్నారు. మోటార్ సైకిల్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని సూచించారు.
మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని, ఇది చట్టరీత్యా నేరమని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
త్రిబుల్ రైడింగ్ ,ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంకెన్ డ్రైవ్) వంటి నిబంధనలు ఉల్లంఘించరాదు.
రోడ్డు భద్రత నియమాలు కేవలం జరిమానాల కోసం కాదని, మీ కుటుంబ సభ్యుల కోసం మీరు సురక్షితంగా మీ గమ్యస్థానాలు చేరుకునేలా చేయడమేనని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
