- నంద్యాల ఆరోగ్య మాత పుణ్యక్షేత్రంలో ఘనంగా తపస్సుకాల ప్రార్థనలు
- విశాఖపట్నం హోలీ స్పిరిట్ ప్రేయర్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక కూడికలు
- భక్తితో దేవుడిపై విశ్వాసం కలిగి జీవించాలని పిలుపు



సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 07 :
సమాజ శ్రేయస్సులో సంఘస్తులు శాంతి సమాధానం కలిగి జీవించాలని, హృదయ పరివర్తన కలిగి నూతన జీవితాన్ని అలవర్చుకోవాలని కర్నూలు మేత్రాసనం పీఠాధిపతి గోరంట్ల జ్వాన్నేస్ పిలుపునిచ్చారు. దేవుడితో సఖ్య పడాలని, ప్రపంచ శాంతి సమాధానం కోసం దేవుడికి నిత్య ప్రార్ధనలు చేయాలని ఆయన కోరారు. నంద్యాల పట్టణం డేనియల్ పురం గేటు సమీపంలోని పరిశుద్ధ ఆరోగ్య మాత పుణ్యక్షేత్రంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన కూటముల కార్యక్రమంలో పీఠాధిపతి గోరంట్ల జ్వాన్వేస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశాఖపట్టణానికి చెందిన హోలీ స్పిరిట్ ప్రేయర్ టీం ఆధ్వర్యంలో ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కె. దేవస్య జోసెఫ్ పర్యవేక్షణలో ప్రార్థన కూడికలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కూడికలకు విచారణ సంఘస్తులతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన దివ్యబలి పూజలో డిషబ్ మాట్లాడుతూ భక్తితో 40 రోజుల తపస్సుకాల దినాలను ప్రార్థనలతో గడపాలని సూచించారు. ఉపవాసం చేయడం ద్వారా తగ్గింపు కలిగి దేవుడికి దగ్గర కావడంతో పాటు ఆత్మీయ బలాన్ని, దేవుడి శక్తిని పొందుకుంటామన్నారు. ఉపవాసం వల్ల దేవుడితో ప్రత్యేకత కలిగి ప్రార్థించడం వల్ల దేవుడు మన పక్షాన నిలబడి కార్యాలను సఫలం చేస్తాడని తెలిపారు. ఉపవాస రోజుల్లో లోకాచారాలకు లోబడి లోక క్రియలకు దూరంగా ఉండాలన్నారు. ఉపవాసం చేసిన పౌలు నేత్రలు తెరువపడ్డాయని, సింహపు బోనులో నుంచి దానియేలు రక్షింపబడ్డారని, మూడు రోజులు ఉపవాసంతో ఎస్తేరు యూదా గోత్రంలోని తన జనాంగాన్ని రక్షించుకొని దేవుడు గొప్ప పొందినదని, రాత్రి పగలు ఉపవాసం చేసిన మోష పది ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారని ఆయన ఉదహరిస్తూ ఉపవాస ప్రత్యేకతలను వివరించారు. అనంతరం నంద్యాల విచారణ గురువు కె. దేవస్య జోసెఫ్ మాట్లాడుతూ ఉపవాస దినాల్లో ప్రార్థన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. నిత్య ప్రార్ధనలు, దానధర్మ క్రియలను పాటిస్తూ సంతోషంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఏసుక్రీస్తు ప్రభువు కూడా 40 రోజులపాటు ఉపవాసం చేసి పరిశుద్ధాత్మ శక్తిని పొందాడని, ఉపవాసం చేయడం ద్వారా శ్రమలను కూడా జయించవచ్చని ఆయన సూచించారు. దివ్య పని పూజా కార్యక్రమంలో సంఘ పెద్దలు, చర్చి సిస్టర్లు, భక్తులు పాల్గొన్నారు.
