నంద్యాలలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభం..

జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా పంపిణీ : ఎన్.ఎం.డి ఫిరోజ్…

నంద్యాల టిడిపి కార్యాలయంలో రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు…

నంద్యాల జిల్లా / జనవరి 02- 2026 / సత్యం వార్త ప్రతినిధి :

నంద్యాల నియోజకవర్గ గోస్పాడు మండలంలో రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పాత పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో ప్రభుత్వం నూతన పాస్ పుస్తకాలను మంజూరు చేసిందని, వాటి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం రీ-సర్వే ప్రక్రియ ముగిసిన గ్రామాల్లో పక్కాగా కొత్త పాస్ పుస్తకాలను రూపొందించడం జరిగిందని. ఈ రోజు జనవరి 2 నుంచి జనవరి 9 వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామ సభలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభల ద్వారా అర్హులైన ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు . రీ-సర్వే పూర్తయిన గ్రామాల రైతులందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రైతుల సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు…

ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ జనవరి 2వ తేదీ నుండి జనవరి 9వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి, పారదర్శకంగా ఈ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తాము అన్నారు. భూముల రీ-సర్వే ద్వారా రైతులకు తమ భూములపై పూర్తి స్థాయి హక్కులు, స్పష్టత లభిస్తాయని, ఇది భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ కొత్త పాస్ పుస్తకాలను పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిడిపి గోస్పాడు మండల కన్వీనర్ తులసిశ్వర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, గోస్పాడు ఎమ్మార్వో, అస్ముద్దీన్ మరియు స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Scroll to Top