జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదు – జిల్లా కలెక్టర్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 23 :

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు అనవసర ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం అనంతరం అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఇటీవలి అపోహల కారణంగా గ్యాస్ కొరత ఉందన్న ప్రచారం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని తెలిపారు. జిల్లాలో సాధారణంగా రోజుకు సుమారు 5,500 ఎల్‌పీజీ గ్యాస్ బుకింగ్స్ నమోదవుతుండగా, ప్రస్తుతం భయాందోళనల ప్రభావంతో ఆ సంఖ్య 10,000 వరకు పెరిగిందని పేర్కొన్నారు. అయితే సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్ చేయకుండా సహకరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఇండక్షన్ స్టవ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇండక్షన్ స్టవ్‌ల లభ్యత, ధరలు తదితర వివరాలను సేకరించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్ల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఎంపిడిఓలు, పంచాయతీ కార్యదర్శులు సమర్పించిన నివేదికల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించామని క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి ఖచ్చితమైన వివరాలను సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు సరైన సమాచారం అందించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్  కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top