

నెలవారీ ప్రణాళికతో లక్ష్య సాధనకు కృషి చేయాలి
పురోగతి లేని మండలాలపై ప్రత్యేక దృష్టి
- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 7 :
ఉగాది పండుగ నాటికి జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి హౌసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో హౌసింగ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ డీఈలు, ఏఈలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీహరి గోపాల్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాకు కేటాయించిన 14,868 ఇళ్ల నిర్మాణాలను నియోజకవర్గాల వారీగా స్పష్టమైన లక్ష్యాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం రూఫ్ స్థాయిలో ఉన్న 1,583 ఇళ్లు, లింటెల్ స్థాయిలో ఉన్న 2,805 ఇళ్లు, బేస్మెంట్ స్థాయిలో ఉన్న 6,880 ఇళ్ల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసేలా హౌసింగ్ ఇంజనీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే పిఎం జన్మన్ పథకం కింద వివిధ దశల్లో ఉన్న 556 ఇళ్ల నిర్మాణాలు కూడా నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో నెలవారీ ప్రణాళికలు రూపొందించి, పూర్తి చేయాల్సిన ఇళ్ల వివరాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఈలు, డీఈలకు స్పష్టంగా అందజేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలసి, ఇళ్ల నిర్మాణాల ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పిస్తూ పనులు పూర్తి చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల, గడివేముల మండలాల్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తక్కువ పురోగతి సాధించిన మండలాలను ప్రత్యేకంగా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కొత్తగా ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు హౌసింగ్ 2.0 (PMAY–U 2.0) పథకం ద్వారా పట్టణ పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు విస్తృతంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకుండా, సానుకూల దృక్పథంతో పనిచేస్తూ, ముఖ్యంగా రూఫ్ స్థాయిలో నిలిచిపోయిన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హౌసింగ్ అధికారులకు ఆదేశించారు.
